సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
కరగని దూరం లో..తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటున్నది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
ఎన్ని వేల నిముషాలో లెక్కపెట్టుకుంటుంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటుంది
ఉన్నా లేని సంగతి గుర్తేలేని గుండే ఇది
మళ్ళీ నిన్ను చూసినాక .. నాలో నేను ఉండలేక .. ఆరాటంగా కొట్టుకుందే ఇది
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
రెప్ప వేయనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువు రాగానే ఆపనంటు చెప్తూ మరీ
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకొని
ఇంకా ఎన్ని ఉన్నాయి అంటూ .. ఇప్పుడే చెప్పాలంటూ..నిద్దరోను అంటుంది
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక .. నీ స్వరం వినాలని తీయగా
కరగని దూరం లో ..తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటున్నది ఆశగా
********************************
గానం: మల్లిఖార్జున్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వులు ఇక ఈ పెదవులకి .. జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి .. నలువైపుల నలుపేనా .. ఏమో !
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
తుంచిన పూలను తెచ్చి .. అతికించలేను గానీ
చైత్రం నేనై వచ్చీ .. నా తప్పు దిద్దుకోనీ
చిగురాశలు రాలిన కొమ్మా .. చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా .. మిగిలుందమ్మా
అందామని ఉన్నా .. అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా !
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
నిన్నటి స్వప్నం కోసం .. వెను తిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం .. ముందడుగు వెయ్యమంటూ
తెలవారని రేయిని నడిపే .. వెలుగవగలనా
తడి ఆరని చెంపలు తుడిచే .. చెలిమవగలనా
నిదురించని నిజమై .. నిలదీసే గతమే
భరించలేని భారమై .. వెంటాడగా !
మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వులు ఇక ఈ పెదవులకి .. జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి .. నలువైపుల నలుపేనా .. ఏమో !
No comments:
Post a Comment